1957లో విడుదలైన  మాయాబజార్ సినిమా గురించి తెలియని తెలుగువాడు ఉండడు. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తోందంటే అలా చూస్తూండిపోతారు.  వందేళ్ల సినీ చరిత్రలో మాయాబజార్ కంటే ఉత్తమమైన చిత్రం లేదని ఓ టెలివిజన్ చానల్ నిర్వహించే సర్వేలో వెల్లడైంది. విశ్వవాప్తంగా గుర్తింపు పొందిన ఈ  తెలుగు చిత్రం లో తెలుగువారి ఆరాధ్య నటులు ఎన్టీఆర్, నాగేశ్వరరావు , మహానటి సావిత్రి , ఎస్వీ రంగారావు వంటి ఎందరో తమ అద్బుతమైన నటనతో అలరించారు. 

ఆ రోజులు నాటికి ఉన్న  అతి తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిత్రాన్ని ఎంత కళాత్మకంగా రూపొందించారో  చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. కెమెరా టెక్నిక్స్, ఛాయగ్రహణం, కళ, దర్శకత్వం ఇప్పటికీ సినీ పండితులకు సైతం  అంతుచిక్కకపోవడం గమనార్హం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని భావితరాలకు అందించేందుకు బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న చిత్రాన్ని ఎంతో శ్రమించి కలర్‌లోకి మార్చారు. ఈ అపురూప దృశ్య కావ్యాన్ని మళ్లీ ఇప్పుడు ఈ తరానికి అందించే ప్రయత్నం జరుగుతోంది. 

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపుదిద్దుకొన్న ‘మాయాబజార్‌’ చిత్రాన్ని రంగుల్లోకి మార్చిన ఘనత గోల్డ్‌స్టోన్‌ సంస్థకు దక్కుతుంది. పాత చిత్రానికి కలర్స్  అద్దడమే కాకుండా డీటీఎస్‌ మిక్సింగ్‌ చేసి 2010లో ఆ సంస్థ విడుదల చేసింది. కలర్ ‘మాయాబజార్‌’కు జనం బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత టీవీల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ‘మాయాబజార్‌’ చిత్రాన్ని చూడడమే తప్ప కలర్ సినిమా చూసిన వాళ్లు  లేరు.  దాంతో మళ్లీ తొమ్మిదేళ్ల అనంతరం విజయవాడకు చెందిన దినేశ్‌ పిక్చర్స్‌ సంస్థ రంగుల ‘మాయాబజార్‌’ హక్కులు కొని, సినిమాను డిజిటలైజ్‌ చేసి, ఈ నెల 12న విడుదల చేస్తోంది. 
 

దర్శకుడు కె.వి.రెడ్డి. విజయా పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ‘మాయాబజార్‌’ చిత్రాన్ని నిర్మించారు. 2013లో సిఎన్‌ఎన్‌- ఐబీన్‌ సంస్థ ఇండియాలో నిర్మించిన వంద అత్యుత్తమ చిత్రాలు ఏమిటనే వాటిపై నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ‘మాయాబజార్‌’ చిత్రానికి అత్యధికులు ఓటు వేశారు.