సారాంశం

చిరంజీవిపై మన్సూర్‌ అలీ ఖాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఇరవై కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 
 

మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్లు తిన్నాడంటూ ఆయనపై షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారీగా పరువు నష్టం దావా వేశారు. హీరోయిన్‌ త్రిషపై తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. `లియో` చిత్రంలో ఆమెని రేప్‌ చేసే సీన్లు లేనందుకు ఆయన బాధపడుతున్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

మన్సూర్‌ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలను చాలా మంది సెలబ్రిటీలు ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌ కేసు కూడా నమోదైంది. చిరంజీవి, ఖుష్బూ వంటి చాలా మంది స్టార్స్ దీనిపై స్పందించి తప్పు పట్టారు. దీంతో మన్సూర్‌ దిగొచ్చి ఆమెకి క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం క్లోజ్‌ అయ్యిందని అంతా భావించారు. కానీ మన్సూర్‌ మాత్రం వదలడం లేదు. తనపై కామెంట్ చేసినవారిపై కక్ష్య తీసుకుంటున్నారు. 

తాజాగా ఆయన చిరంజీవి, ఖుష్బూ, త్రిషలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. చిరంజీవిపై ఏకంగా రూ.20కోట్ల దావా, అలాగే త్రిష, ఖుష్బూలపై రూ. 10కోట్ల దావా వేయబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నావంటూ కామెంట్ చేశారు. ఆ డబ్బు తన సొంతానికి వాడుకున్నారని, ప్రజలకు సహాయం చేయలేదన్నారు. నాది వక్రబుద్ది అని చిరంజీవి అన్నాడు, మరీ ఆయన ఏం చేశాడు. పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదన్నారు. 

చిరంజీవి తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ నాకు తెలియదు. ఆయన కూడా పార్టీ పెట్టాడు. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగలేదు. ప్రతి ఏడాది ఓల్డ్ హీరోయిన్లకి పార్టీ ఇస్తుంటాడు. ఆయనతో నేను కూడా కలిసి నటించాను. కానీ ఆ పార్టీకి తనని ఎప్పుడూ పిలవలేదని, ఆయన కేవలం హీరోయిన్లకు మాత్రమే పార్టీ ఇస్తాడని, అది ఆయన ఇష్టమని చెప్పారు. కానీ తనపై విమర్శలు వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందనే విషయాన్ని నాకు ఫోన్‌ చేసి తెలుసుకుంటే బాగుండేది. ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అలా మాట్లాడటం తనని చాలా బాధించిందని తెలిపారు మన్సూర్‌ అలీ ఖాన్‌.

ఇంకా చెబుతూ, త్రిష, ఖుష్బూలపై రూ. పదికోట్ల చొప్పున, చిరంజీవి రూ.20కోట్ల పరువునష్టం దావా వేస్తా. వచ్చిన దబ్బుని తమిళనాడులో మధ్యం తాగి చనిపోయిన కుటుంబాలకు అందజేస్తా` అని మన్సూర్‌ అలీ ఖాన్‌ తెలిపారు.