అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ సినిమా డిజాస్టర్ అంటే మాత్రం నాగార్జున ఒప్పుకోవడం లేదు. ఇలాంటి కథలు జనాలకు ఎక్కడానికి కాస్త సమయం పడుతుందని.. ఇంకొంతకాలం ఓపిక పట్టాలని అంటున్నారు. 

గతంలో తను నటించిన 'గీతాంజలి', 'నిర్ణయం' లాంటి సినిమాలను ఉదాహరణలుగా చూపిస్తున్నాడు. అప్పటిరోజులు వేరు.. ఇప్పుడు వేరు. 'మన్మథుడు 2' సినిమా ఫ్లాప్ అనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. సినిమా విడుదలైన రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోయాయి. వీకెండ్ లోనే డ్రాప్ అయిన ఈ సినిమా సోమవారం పూర్తిగా చతికిలపడింది. బక్రీద్ హాలిడే ఉన్నప్పటికీ ఎవరూ ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపలేదు. 

దీంతో 'మన్మథుడు 2' సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విషయాన్ని నాగ్ కూడా పరోక్షంగా అంగీకరించాడు. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన చిత్రబృందం టూర్ ప్లాన్ చేసింది. నాగార్జున స్వయంగా కొన్ని పట్టణాల్లో పర్యటించాలని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా ప్లాన్ కూడా వేసుకున్నారు. కానీ 'మన్మథుడు 2' పరిస్థితి మరింత దారుణంగా పడిపోయింది.

నెగెటివ్ టాక్ ఎక్కువగా ఉండడంతో ఇలాంటి సమయంలో టూర్ ప్లాన్ చేయడం కూడా కరెక్ట్ కాదని ఆ ప్లాన్ రద్దు చేసుకున్నారు. ఏపీ, నైజాంలో ఈ సినిమాను రూ.18 కోట్లకు అమ్మితే తొమ్మిది కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. సినిమాకి వచ్చిన టాక్ తో బ్రేక్ ఈవెన్ అవ్వడమంటే కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.