బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మణికర్ణిక'. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ కంగనా నటనను మాత్రం అభిమానులు మెచ్చుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా విడుదలైన మరునాడే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలను ఇలానే పైరసీ చేస్తున్నారు. పెద్ద సినిమాలకు, కాస్త బజ్ ఉన్న చిత్రాలపై పైరసీ ఎఫెక్ట్ బాగా పడుతుంది.

సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ చేసి ఇంటర్నెట్ లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు 'మణికర్ణిక'కు కూడా అదే దెబ్బ పడింది. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దెబ్బ తింటుందేమోనని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో కంగనాతో పాటు అంకితా లోఖండే, జిషూ సేన్ గుప్తా, డానీ వంటి తారలు నటించారు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాతో పాటు పోటీగా విడుదలైన 'థాక్రే' కూడా ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది.

వీటితో పాటు 'ఉరి', 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' వంటి చిత్రాలు కూడా విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి.