స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేశారు. తను చేసిన సినిమా ప్లాప్ అయినందుకు ఆడియన్స్ కు బహిరంగ క్షమాపణలు కోరారు.
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన తాజా చిత్రం థగ్ లైఫ్ పరాజయం పాలైనందుకు క్షమాపణలు తెలిపారు. పగల్ నిలవు సినిమాతో దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన మణిరత్నం, ఇదయ కోవిల్, మౌన రాగం, నాయకుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2022లో ఆయన కలల ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ 1 భారీ విజయాన్ని సాధించింది. దీని తర్వాత వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2 కూడా మంచి సక్సెస్ ను అందించింది.
అదే ఉత్సాహంతో థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు మణిరత్నం. కమల్ హాసన్, శింబు, త్రిష, అపిరామి వంటి స్టార్ తారాగణంతో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమాను కమల్ హాసన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రమోషన్స్ అట్టహాసంగా జరిగినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది.30 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో నాయకుడు స్థాయిలో ఉంటుందని అందరూ భావించారు. కానీ కథ భిన్నంగా ఉండడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. 2025 నేపథ్యంలో సాగే కథకు మంచి స్పందన లభించలేదు.
డ్రాగన్, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి చిత్రాలు మంచి విజయం సాధించినప్పటికీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన థగ్ లైఫ్ పరాజయం పాలైంది. అయితే ఈ సినిమా పరాజయం తరువాత రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. సినిమా విశ్లేషకులు మాత్రం సీనియర్ దర్శకులు కొత్త దర్శకులతో పోటీ పడలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. దానికి కారణం కథ బలహీనంగా ఉండడమే అని అంటున్నారు.
ఇక థగ్ లైఫ్ పరాజయంపై మణిరత్నం స్పందించారు. నాయకుడు స్థాయిలో సినిమా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు ఆ స్థాయిలో అనుభూతిని ఇవ్వలేకపోయామని, దానికి తాను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. సాధారణంగా సినిమా పరాజయానికి దర్శకులు బాధ్యత వహించరు. అంతే కాదు తమ తదుపరి చిత్రాలలో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. కానీ మణిరత్నం క్షమాపణలు చెప్పడం విశేషం. దాంతో మరణిత్నంకు సపోర్ట్ గా నిలుస్తున్నారు నెటిజన్లు. ఆయన మంచి మనసుకు ప్రశంసిస్తున్నారు.
