మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సరికొత్త నిర్ణయానికి నాంది పలికారు. ఇప్పటి వరకు మా అసోసియేషన్ కేవలం తెలుగు నటీనటులకు మాత్రమే వర్తిస్తూ వచ్చింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సరికొత్త నిర్ణయానికి నాంది పలికారు. ఇప్పటి వరకు మా అసోసియేషన్ కేవలం తెలుగు నటీనటులకు మాత్రమే వర్తిస్తూ వచ్చింది. తెలుగు నటీనటులకు మాత్రమే మా సభ్యత్వం, తద్వారా వచ్చే బెనిఫిట్స్ అందుతూ వచ్చాయి.
ఇకపై తెలుగు చిత్రాల్లో నటించే బాలీవుడ్ వారికి కూడా మా సభ్యత్వం వచ్చేలా, వారికి మా అసోసియేషన్ నుంచి పథకాలు అందేలా మంచు విష్ణు సరికొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల మా అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివబాలాజీ ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని కలిశారు. ఈ సందర్భంగా వారితో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు.తాజాగా బాలీవుడ్ అసోసియేషన్, మా అసోసియేషన్ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు బాలీవుడ్ అసోసియేషన్‌ల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలలో పని చేసే బాలీవుడ్ కళాకారులకు 'మా' సభ్యత్వం అందుతుంది. అలాగే మన తెలుగు నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తే వాళ్ళకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం అందుతుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే 'మా' వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఈ ఒప్పందంతో మన తెలుగు నటీనటులకు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. త్వరలోనే వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుందని, అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబం గా ఉండాలి అని విష్ణు మంచు తెలిపారు.
సౌత్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారిన తర్వాత అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కలసి నటిస్తున్నారు. దీనితో మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాలని ఇస్తుందని అంతా భావిస్తున్నారు.
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్‌గా ఉన్న మంచు విష్ణు, వారి విద్యా సంస్థల్లో ప్రవేశం కోరుకునే సినీ ప్రముఖుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మరియు ట్యూషన్ ఫీజులో రాయితీలను ప్రకటించారు. అలాగే మంచు విష్ణు మా ఎన్నికల్లో మా అసోసియేషన్ సొంత భవనం కల నెరవేరుస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా త్వరలోనే నెరవేరుతుందని విష్ణు అన్నారు.
