పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిని రాజేంద్రనగర్‌ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని ఓ యువతి(22)కి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు ఓ మ్యారేజ్ బ్యూరోలో వివరాలు ఇచ్చారు.

అదే మ్యారేజ్ బ్యూరోలో ఎల్బీనగర్ కి చెందిన సాయినాథ్(28) కూడా తన వివరాలు నమోదు చేసుకున్నాడు. సాయినాథ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకొని కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.

సదరు యువతికి.. సాయినాథ్ కి పరిచయం ఏర్పడడంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలు అంగీకరించడంతో పెళ్లికు కూడా రెడీ అయ్యారు. సాయినాథ్ సదరు యువతిని తనకు కాబోయే భార్య అంటూ అందరికీ పరిచయం కూడా చేశాడు. అయితే కొన్ని రోజులుగా సాయినాథ్ ఆమెని కలవకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆమె ఫోన్ చేస్తున్నా 
స్పందించడం లేదు.

దీంతో అతడిని కలిసి నిలదీయగా.. పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. అతడి మాటలతో ఆవేదనకు గురైన యువతి నాలుగు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం గమనించి కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మంగళవారం సాయినాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.