మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కలిగింది. దీనికి కారణం ఆయన అభిమానులే.. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తరాది చిత్రపరిశ్రమతో పాటు దక్షిణాదిలో ఒక్క తమిళచిత్ర పరిశ్రమ మినహా అన్ని సినీ పరిశ్రమలను ఈ అవార్డులు 
వరించాయి. తమిళంలోనే రెండు జాతీయ అవార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇది ఇలా ఉండగా.. మమ్ముట్టి అభిమానులు అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్ రవిపై గొడవకి దిగారు. ఆయన ఫేస్ బుక్ లో ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. దానికి కారణం మమ్ముట్టి నటించిన సినిమాకి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడమే.. మమ్ముట్టి నటించిన 'పెరంబు' సినిమా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.

అలాంటిది ఆ సినిమాకి ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదనే విషయాన్ని ఆయన అభిమనులు తట్టుకోలేకపోతున్నారు. అవార్డు కమిటీపై ఆరోపణలు చేయడంతో పాటు నేషనల్ అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్ రవిపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. అతడిపై పరుష పదజాలం వాడడంతో వెంటనే ఆయన మమ్ముట్టికి ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించారు.

'మిస్టర్ మమ్ముట్టి.. మీ అభిమానులు పరుష పదజాలంతో నాపై దాడి చేస్తున్నారు.. 'పెరంబు' సినిమా అవార్డు ఇవ్వలేదని దూషిస్తున్నారు.. దానికి వివరణ ఇస్తున్నాను' అంటూ కమిటీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశించకూడదని.. 'పెరంబు' సినిమాను ప్రాంతీయ కమిటీనే తిరస్కరించడంతో కేంద్ర కమిటీపరిశీలకు రాదని.. విషయం తెలియక మీ అభిమానులు గొడవ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో మమ్ముట్టికి వెల్లడించారు. వెంటనే స్పందించిన మమ్ముట్టి.. క్షమించమని కోరారు. ఈ విషయాలేవీ తనకు  తెలియవని.. జరిగినదానికి నేను క్షమాపణలు చెబుతున్నా అంటూ  బదులిచ్చారు.