Asianet News TeluguAsianet News Telugu

అందరు కలసి నా సోదరుడిని చంపేశారు..మమ్ముట్టి!

  • మానవత్వం మంటగలిసిపోయే ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
  •  కేరళలో మతి స్థిమితం లేని మధు అనే యువకుడిని కొందరు కట్టేసి చితకబాదారు
  • మధును పోలీసులు ఆసుపత్రికి తరలించేటప్పటికే మృతి చెందాడు.
Mammootty about Madhu

``మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు....మచ్చుకైనా చూడు లేడు....మానవత్వం ఉన్నవాడు.....``ప్రముఖ కవి అందెశ్రీ రాసిన ఈ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. నిజంగానే మానవత్వం మంటగలిసిపోయే ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తమ పైశాచికానందం కోసం ఓ మెడికో....టెర్రస్ మీద నుంచి కుక్కను కిందకు విసిరేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో చోరీలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై మతి స్థిమితం లేని మధు అనే యువకుడిని కొందరు చేతులు కట్టేసి చితకబాదారు. అంతేకాదు ఆ దుశ్చర్యను వీడియో తీసి  సెల్ఫీలు దిగారు. మధును పోలీసులు ఆసుపత్రికి తరలించేటప్పటికే మృతి చెందాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ యువకులపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు మమ్ముట్టి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 

అతడికి మతి స్థమితం లేదని - అంతమాత్రాన అలా చేయడం ఏమిటని మమ్ముట్టి అన్నారు. అతడు ఆదివాసి కాదని - తన సోదరుడు లాంటి వాడని చెప్పారు. ఆ దుండగులు తన సోదరుడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచిస్తే మధు..... నిందితులకి కూడా సోదరుడిగా - కుమారుడిగా కనిపిస్తాడన్నారు. మధు కూడా మనలాగే భారతీయ పౌరుడని - అతడికి కూడా మనతోపాటే హక్కులుంటాయని తెలిపారు. మతి స్థిమితం లేక ఆకలిని తీర్చుకోవడానికి దొంగతనం చేసేవారిని దొంగ అని ముద్ర వేయకూడదన్నారు. అటువంటి వారిని - ఆ పేదరికాన్ని సమాజమే సృష్టించిందని భావోద్వేగంతో పోస్ట్ చేశారు. పరిస్థితులు ఏమైనా - కారణం  ఏదైనా ఓ మనిషి మరో మనిషిపై దాడి చేయడం క్షమార్హం కాదన్నారు. చివరగా 'సారీ మధు` అని ఆవేదనపూరితంగా మమ్ముట్టి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios