మలయాళ సినిమాలు ఇటీవల దుమ్మరేపుతున్నాయి. తాజాగా `మంజుమేల్ బాయ్స్` అనే సినిమా సునామీ సృష్టిస్తుంది. ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది.
మలయాళ సినిమాలు ఎప్పుడూ సత్తా చాటుతూనే ఉంటాయి. ఇక్కడి నుంచే చాలా సినిమాలు రీమేక్ అయి ఇతర భాషల్లో సూపర్ హిట్లు అయ్యాయి. అయితే ఆ మధ్య వీటి జోరు తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అందులో ఒకటి `ప్రేమలు`, రెండు `మంజుమేల్ బాయ్స్`.
ఇందులో `మంజుమేల్ బాయ్స్` రచ్చ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఈ చిత్రం కేవలం పది కోట్లతో రూపొంది ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ కుర్రాళ్లు సౌబిన్ శహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గేసే, గజపతి ఎస్ పోదువాల్, లాల్ జూ, దీపక్ పరంబోల్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదలైంది. చాలా నార్మల్ మూవీగా ఈ చిత్రం విడుదలైంది. కానీ ఇప్పుడు సౌత్ మొత్తాన్ని ఊపేస్తుంది. ఈ మూవీ కేవలం పది రోజుల్లోనే ఏకంగా వంద కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో అందరి చూపు ఈ మూవీపై పడింది. తమిళంలో డబ్ అయ్యింది. అక్కడ కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక త్వరలో తెలుగులోనూ రాబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో మంజు మేల్ బాయ్స్ అనే కుర్రాళ్ల టీమ్.. తమిళనాడులోని గుణ గుహలు కి విహారయాత్రకి వెళ్తారు. వీరంతా కమల్ హాసన్ అభిమానులు. ఆయన నటించిన `గుణ` సినిమా షూటింగ్ జరిగిన కేవ్స్ కి ఈ కుర్రాళ్లు వెళ్తారు. అక్కడ ఓ వ్యక్తి డెవిల్స్ కిచెన్‌లో పడిపోతారు. దీంతో మిగిలిన యువకులు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారనేది కథ. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుంది. సీట్ ఎడ్స్ థ్రిల్లర్‌గా సాగుతుంది. విశేష ఆదరణ పొందుతూ సంచలన విజయాన్ని సాధించింది.
మలయాళంలో తక్కువ బడ్జెట్‌తో రూపొంది పెద్ద హిట్ కావడం మామూలే. కానీ కేవలం పది కోట్లతో తెరకెక్కి వంద కోట్లు దాటడం విశేషమనే చెప్పాలి. ఇది మలయాళ పరిశ్రమలో పెద్ద రికార్డుగానే చెప్పొచ్చు. మరి ఇది మున్ముందు ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
