భావన కేసు మరవకముందే మరో మళయాల నటిపై లైంగిక వేధింపులు

First Published 20, Dec 2017, 6:25 PM IST
MALAYALAM HEROINE TROLLED FOR COMMENTS
Highlights
  • కేరళలోో మరో నటికి లైంగిక వేధింపులు
  • అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు
  • మలయాళ నటి పార్వతి పై మమ్ముట్టి అభిమానుల ట్రోలింగ్

కేరళలో నటి భావనపై లైంగిక వేధింపుల వ్యవహారం మరువక ముందే.. మరో మళయాల నటి పార్వతికి అదేతరహాలో చేదు అనుభవం ఎదురైంది. సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన కసాబా చిత్రంపై పార్వతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో మమ్ముట్టి ఫ్యాన్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వేధించారు. వివాదంపై మమ్ముట్టి మౌనం వహించడంతో మెల్లిగా అతని మెడకు చుట్టుకుంటోంది.

 

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ వేదికగా పార్వతి, మమ్ముట్టి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ చిత్రోత్సవంలో పార్వతి మాట్లాడుతూ.. కసాబా టైటిల్‌ను డైరెక్ట్ గా చెప్పకున్నా.. సూపర్‌స్టార్ మమ్ముట్టి సినిమాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. వేదికపై ఉన్న మరో నటి గీతూ మోహన్‌దాస్ ఆ సినిమా పేరు చెప్పమని బలవంతంగా చేయటంతో చివరకు పార్వతి కసాబా చిత్రం పేరు వెల్లడించింది.

 

దీంతో పార్వతి పై మమ్ముట్టి ఫ్యాన్స్, కొందరు సినిమా పరిశ్రమ పెద్దలు మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తోటి నటుడి సినిమాపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేంటని, పెద్దలను గౌరవించడం తెలుసుకోవాలని పార్వతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా రేప్ చేస్తాం. సారీ చెప్పకపోతే చంపేస్తాం. దారుణంగా లైంగిక దాడి చేస్తాం. నడువడానికి చాలా కష్టపడాలి. మేం లైంగిక దాడి చేస్తే పీరియడ్ కూడా రాకుండా దెబ్బతింటుంది అని నటి పార్వతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మమ్ముట్టికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై సూపర్‌స్టార్ల ఫ్యాన్స్‌ ఆగడాలు ఎక్కువయ్యాయనే వాదన వినిపిస్తున్నది.

 

తాజా వివాదంపై పార్వతీ స్పందించింది. కసాబాలో పనిచేసిన నటీనటులను గానీ, మమ్ముట్టిని కించపరచడం నా ఉద్దేశం కాదు. యాదృచ్చికంగా ఇది జరిగింది. దానిపై ఇంత రాద్దాంతం చేయడం సమంజసమా? నన్ను ఆంటీ అని, కోతి అని పిలుస్తున్నారు అని పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది.

 

గతంలో సూపర్‌స్టార్ దిలీప్‌పై వ్యాఖ్యలు చేసిన మరో నటిపై లైంగికదాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ జైలుకెళ్లి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా పార్వతి ఘటన కూడా అదే మాదిరిగా ఉందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

 

పార్వతీ తీవ్రమైన హెచ్చరికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కవులు, కళాకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే మమ్ముట్టి మాత్రం ఈ వివాదంపై నోరు విప్పడం లేదు. అయితే పార్వతిపై అనుచిత వ్యాఖ్యలు ఊపందుకోవడం ఈ వివాదంలో సరికొత్త ట్విస్ట్‌గా కనిపిస్తున్నది. పార్వతి, మమ్ముట్టి వివాదంపై కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ వివాదంలో బెదిరింపులకు పాల్పడుతున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సైబర్ పోలీసులకు మంత్రి సూచించారు. ఎవరైనా తన అభిప్రాయాన్ని చెబితే ఎదురుదాడి చేయడం తప్పు. ఎంతో ప్రతిభావంతురాలైన పార్వతిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అని మంత్రి థామస్ విచారం వ్యక్తం చేశారు.

loader