మద్యం మత్తులో తోటి ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. విమానంలో నటి దివ్యకు వేధింపులు.. !!
దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు కూడా వేధింపులకు బాధితులుగా నిలుస్తున్నారు.

దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు కూడా వేధింపులకు బాధితులుగా నిలుస్తున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో వేధింపులు ఎదుర్కొన్నారు. విమానంలో తన తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నట్టుగా దివ్య ప్రభ తెలిపింది. అక్టోబర్ 9న ముంబై నుంచి కొచ్చి వెళ్లే ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 681లో తన తోటి ప్రయాణికుడు తనను వేధించాడని కేరళ పోలీసులకు దివ్య ప్రభ ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయాన్ని దివ్య ప్రభ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఎయిర్‌హోస్ట్‌స్‌కు రిపోర్టు చేసినప్పటికీ.. వారు విమానం టేకాఫ్‌కు ముందు తనను వేరే సీటుకు మార్చడం తప్ప ఎలాంటి చర్య తీసుకోలేదని కూడా దివ్య ప్రభ పేర్కొన్నారు. ‘‘ఈ విషయంపై కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత.. విమానాశ్రయం, ఎయిర్‌లైన్ అధికారులకు నివేదించాను. వారు నన్ను విమానాశ్రయంలోని పోలీసు సహాయ పోస్ట్‌కి వెళ్లమని చెప్పారు’’ అని దివ్య ప్రభ తెలిపారు.
వేధింపులకు సంబంధించి అధికారిక ఫిర్యాదుతో పాటు తన విమాన టికెట్‌ను కూడా దివ్య ప్రభ జత చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ప్రయాణికుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. ఇక, ఎయిరిండియా గ్రౌండ్ ఆఫీస్, విమాన సిబ్బంది నుంచి వచ్చిన స్పందన నిరాశ పరిచిందని కూడా ఆమె పేర్కొన్నారు.
‘‘ నేను విమానంలో 12ఏ సీటులో ఉన్నాను. 12 సీలో కూర్చున్న ప్రయాణికుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతని సీటును నా పక్కన ఉండే 12 బీకి మార్చుకున్నాడు. ఆ తర్వాత సీటు మార్పుకు సంబంధించి ఎటువంటి లాజిక్ లేకుండా వాదనకు దిగాడు. శారీరకంగా తాకడం సహా తప్పుగా ప్రవర్తించాడు’’ అని దివ్య ప్రభ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.