సైరా చిత్ర యూనిట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పర్యటిస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చెన్నై, బెంగుళూరు, ముంబైనగరాల్లో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో సైరా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేరళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ అతిథిగా హాజరయ్యాడు. 

ఈ కార్యక్రమంలో పృథ్విరాజ్ మాట్లాడుతూ.. సైరా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాలని చిరంజీవి సర్ ఫోన్ చేసి నన్ను అడిగారు. కానీ ఆ సమయంలో వివిధ చిత్రాల్లో నటిస్తూ స్పెయిన్ లో ఉన్నాను. సైరాలో నటించలేకపోయాను. సైరా ట్రైలర్ చూసాక ఈ చిత్రంలో నటించనందుకు చాలా బాధపడ్డా. 

ఇంతటి భారీ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించిన రాంచరణ్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నా అని పృథ్విరాజ్ తెలిపాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సైరా చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పెద్దఎత్తున విడుదల చేస్తున్నారు. 

నయనతార కథానాయికగా నటించింది. అమితాబ్ బచ్చన్ చిరంజీవి గురువుగా నటించారు. తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.