సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. చాలా గ్యాప్‌తో ఆయన తెలుగు సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. 

మలైకా అరోరా తెలియని ఇండియన్‌ సినీ ప్రియుడు ఉండడు. ఇప్పుడు సోషల్‌ మీడియాని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఆమె తెలుసు. ఆమె మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌ ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అనే విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగులో ఆయన సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యాడు. గతంలో చిరంజీవి నటించిన `జై చిరంజీవ` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేశారు. అదరగొట్టాడు. ఆ తర్వాత చాలా గ్యాప్‌తో రాజ్‌ తరుణ్‌ నటించిన `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`లో మెరిశారు. కానీ సినిమా ఆడకపోవడంతో ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్‌లో సినిమా చేసేందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో ముఖ్య పాత్రలో అర్బాజ్‌ ఖాన్‌ కనిపించనున్నారు. యంగ్‌ హీరో అశ్విన్‌ బాబు హీరోగా రూపొందుతున్న ఈ మూవీకి అప్సర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్‌రెడ్డి మూలి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో అర్బాజ్‌ఖాన్‌ నటిస్తున్న విషయాన్ని టీమ్‌ వెల్లడించింది. సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఒక తెలుగు చిత్రంలో నటించడం ఆయనకి అమితమైన సంతోషాన్నివ్వగా, అది తమ గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఒక డిఫరెంట్ కథలోని ముఖ్య పాత్రతో జరగడం ఇంకా ఆనందంగా ఉందంటున్నారు నిర్మాత. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ , `అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థలోనే అర్బాజ్ ఖాన్ తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం` అని అన్నారు. 

అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది, తమిళ నటుడు సాయి ధీన ప్రధాన పాత్రలో నటించనున్నారు. దీనికి ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌, దాశరథి శివేంద్ర కెమెరామెన్‌గా, వికాస్‌ బడిస మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సాహి సురేష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

అర్బాజ్‌ ఖాన్‌ సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు అనే విషయం తెలిసిందే. నటుడిగా రాణిస్తున్నారు. బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేశారు. అయితే హీరోగా సక్సెస్‌ కాలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పిస్తున్నారు. ఇక 1998లో మలైకా అరోరాని పెళ్లి చేసుకున్నారు. దాదాపు 19ఏళ్లు కలిసి ఉన్నారు. 2017లో విడిపోయారు. గతేడాది శౌర ఖాన్‌ని పెళ్లి చేసుకున్నారు.