మహేష్‌బాబు సినిమా టికెట్ కోసం థియేటర్ వద్ద క్యూలో నిలబడి షాకిచ్చాడు. ఓ అమ్మాయిని కాదని ఆయన లైన్‌ని తోసుకుంటూ వెళ్లడం ఇప్పుడు వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు షాకిచ్చాడు. సెలబ్రిటీ హోదాలో ఉన్న ఆయన సాధారణ వ్యక్తిలా మారిపోయాడు.టాలీవుడ్‌లోనే పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి, ఆయనకంటూ సొంతంగా భారీ మల్టీప్లెక్స్ ఉన్నప్పటికీ సినిమా టికెట్ కోసం లైన్‌లో నిల్చున్నాడు. ఏకంగా అమ్మాయిని మభ్య పెట్టి ముందున్నోళ్లని తోసుకుంటూ టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. మరి మహేష్ టికెట్ కోసం లైన్‌లో నిల్చోవడమేంటి? ఎందుకలా చేశాడు? అసలేం జరిగిందనేది చూస్తే..
మహేష్‌బాబు నిర్మాతగా మారి `మేజర్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా మహేష్‌కి చెందిన జీఎంబీతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా అడవి శేషు నటించారు. సాయీ మంజ్రేకర్ కథానాయికగా నటించింది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. `26/11` హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ `మేజర్` చిత్రం రూపొందింది. జూన్ 3న సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాని దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు వరుస ప్రమోషన్లతో జోరు పెంచింది యూనిట్. అడవి శేషు, సాయీ మంజ్రేకర్, దర్శకుడు, నిర్మాతలు ఈవెంట్లు నిర్వహిస్తూ, అలాగే ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న షోస్‌లోనూ పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమాకి హైప్ తెచ్చేప్రయత్నం చేస్తున్నారు. అయితే ట్రైలర్ ఈవెంట్‌లో నిర్మాత మహేష్‌బాబు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి చిత్ర ప్రమోషన్ కోసం ఆయన రంగంలోకి దిగారు. అందుకోసం ఓ ప్రత్యేకమైన వీడియోని రూపొందించారు.
ఇందులో మహేష్‌బాబు, అడవిశేషు, యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ అయిన నిహారిక ఎన్ఎమ్ (Niharika NM)తో కలిసి వినూత్నంగా ఓ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో నిహారిక.. ఇది ‘మేజర్’ సినిమా లైనేనా అంటూ టికెట్ కౌంటర్ వద్ద క్యూలోని వారిని ప్రశ్నించింది. అవునని సమాధానం రావడంతో టికెట్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చినవారంతా ఆమె కంటే ముందు నిలబడుతున్నారు.
కాసేపు చూసిన ఆమె మరో వ్యక్తి రాగానే అతన్ని ప్రశ్నించింది. అతనెవరో కాదు అడవి శేషు. అదేంటని అడవి శేష్‌ని నిహారిక ప్రశ్నించగా.. వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడే మహేష్‌బాబు కూడా వచ్చి క్యూలో నిలబడతారు. మహేష్‌ని కూడా నిలదీయాలనుకుంటుంది నిహారిక. కానీ ఆయన్ని చూసి ఆశ్చర్యపోయి సైలెంట్ అవుతుంది. అనంతరం మహేష్ ఆమె వైపు తిరిగి మా ఫ్రెండ్స్‌ని కూడా పిలవవచ్చా అని అడగ్గా నిహారిక ఓకే అంటుంది. అప్పుడే మహేష్‌ని మీ ఫోన్ నెంబర్ అడగాలనుకుంటుంది నిహారిక. కానీ ఆ అమ్మాయిని మభ్యపెట్టి ముందున్న వారిని తోసుకుంటూ టికెట్ కౌంటర్ వద్దకి వెళ్తాడు మహేష్. ఆయన వెళ్లిపోవడంతో ఆమె వెనక్కి తిరుగుతుంది. వెనకాల ఉన్న అడివి శేష్ కలగజేసుకుని నా నెంబర్ ఇవ్వమంటావా? అని అడుగుతారు. ఆయన ఫోన్ నెంబర్ చెబుతుండటంతో వీడియో పూర్తవుతుంది.
ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇలాంటి వీడియోలో మహేష్ బాబు పాల్గొనడం ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల మహేష్ పంథా మార్చుకున్నట్టు తెలుస్తుంది. `సర్కారు వారి పాట` సమయంలోనే ఆయన ఎప్పుడూ లేని విధంగా ఇంటర్వ్యూలిచ్చారు. ప్రమోషనల్ పాల్గొన్నారు. మరోవైపు సక్సెస్ సెలబ్రేషన్‌లో ఏకంగా ఎవరు పిలవకుండానే స్టేజ్‌పైకి ఎక్కి డాన్స్ చేసి షాకిచ్చారు. దీంతో అభిమానులు షాకయ్యారు. ఆశ్చర్యపోతూనే అభిమాన హీరో అలా ఊహించని విధంగా చేయడంతో సంబరపడ్డారు. ఇప్పుడు ఇలా `మేజర్` చిత్రం కోసం ప్రమోషనల్ వీడియోలో పాల్గొనడం విశేషంగా చెప్పొచ్చు.
