తెలంగాణలో థియేటర్ల ఓపెన్‌ని తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన సమయంలోనే హడావుడిగా థియేటర్లని ఓపెన్‌ చేసుకోవచ్చని చెబుతూ జీవో విడుదల చేసింది. యాభై శాతం సిట్టింగ్‌తో థియేటర్లని నడుపుకోవాలని, కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ అనుమతి రాగానే థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 

థియేటర్‌లో సినిమాలను చూసేందుకు జనం ఇప్పుడు అంత ఆసక్తిగా లేరు. కరోనా భయం ఇంకా పోలేదు. పైగా చలికాలం కావడంతో రెండో దఫా వైరస్‌ విజృంభించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్‌ ఓపెన్‌ చేసేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇప్పుడు మహేష్‌ బాబు ధైర్యం చేశాడు. తనకి చెందిన ఏఎంబీ  సినిమాస్‌ మల్టీఫ్లెక్స్ ని ఓపెన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు(శుక్రవారం) తమ మల్టీఫ్లెక్స్ ని ఓపెన్‌ చేస్తున్నట్టు మహేష్‌ ప్రకటించారు. 

ఏఎంబీలో ఈరోజు మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. దీంతోపాటు పలు హాలీవుడ్‌ చిత్రాలను వేయబోతున్నారు. మరి జనం చూసేందుకు వస్తారా? థియేటర్‌కి స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే మహేష్‌ ఫ్యాన్స్ ఈ విషయాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో `బాహుబలి` తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా బన్నీ నటించిన `అలా వైకుంఠపురములో` నిలిచింది. ఇది కూడా ఈ సంక్రాంతికే విడుదలైంది. 

అయితే ఈ దెబ్బతో `అలా వైకుంఠపురములో` చిత్ర కలెక్షన్లని `సరిలేరు నీకెవ్వరు` దాటేయాలని మహేష్‌ అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో దీన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ఓ వైపు సెటైరికల్‌గా, మరోవైపు ప్రశంసల రూపంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి నిజంగా `సరిలేరు నీకెవ్వరు`.. బన్నీ చిత్రాన్ని కలెక్షన్లలో దాటేస్తుందా? అన్నది చూడాలి. ఇదిలా ఉంటే తమిళనాట థియేటర్లు ఓపెన్‌ అయిన సందర్భంగా `సరిలేరు నీకెవ్వరు`ని డబ్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మొదట డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. సంక్రాంతి పండుగ కావడంతో భారీ కలెక్షన్లనే రాబట్టింది.