పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` విజయవంతంగా రన్‌ అవుతుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించారు. ఏప్రిల్‌ 9న సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. ఈ సినిమాపై సినీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా వాళ్లే కాదు రాజకీయ నాయకులు సైతం పార్టీలకు అతీతంగా ఈ చిత్రాన్ని అభినందిస్తుండటం విశేషం. 

చిరంజీవి `వకీల్‌సాబ్‌` సినిమా చూసి పవన్‌ని, చిత్ర యూనిట్‌ని అభినందించారు. తాజాగా మహేష్‌ బాబు సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పవన్‌ని ఆయన పొగడ్తలతో ముచ్చెత్తడం విశేషం. ఆయన చెబుతూ, `పవన్‌ టాప్‌ ఫామ్‌లోకి వచ్చారు.  `వకీల్‌సాబ్‌`లో పవర్‌ ప్యాక్డ్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చారు. ప్రకాష్‌రాజ్‌ బ్రిలియంట్‌గా చేశారు. అమ్మాయిలు నివేదా, అంజలి, అనన్య హార్ట్ టచ్చింగ్‌ నటనని ప్రదర్శించారు. థమన్‌ మ్యూజిక్‌ అద్భుతం. దర్శకుడు వేణు శ్రీరామ్‌, దిల్‌రాజు, శృతి హాసన్‌, పీఎస్‌ వినోద్‌, బోనీ కపూర్‌లకు అభినందనలు` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. 

దీనికి స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నివేదా థామస్‌, అనన్య.. మహేష్‌కి థ్యాంక్స్ చెప్పారు. మంచు మనోజ్‌ సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే సినిమాకి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వస్తోన్న ఓపెనింగ్స్ ని, ఓవరాల్‌గా కలెక్షన్లని మాత్రం చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం.