మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇక చిత్రబృందానికి ఈ సినిమాపై ఎంత నమ్మకముందో వారి మాటలను బట్టి అర్ధమవుతోంది.

మహేష్ బాబు సినిమా గురించి పెద్దగా మాట్లాడలేదు కానీ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. 'మహర్షి' సినిమా మహేష్ నటించిన 25వ సినిమా కావడంతో తనతో ఇప్పటివరకు కలిసి పని చేసిన దర్శకులందరికీ మహేష్ స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు.

ఈ క్రమంలో రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, గుణశేఖర్ వంటి దర్శకులను తలచుకున్నాడు. కొరటాల శివని ప్రత్యేకంగా పొగిడాడు. వంశీ పైడిపల్లిని స్పెషల్ గా ట్రీట్ చేశాడు. కానీ మహేష్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ సినిమా 'పోకిరి'.. మహేష్ అభిమానులు ఇప్పటికీ ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారు.

అలాంటి సినిమా తీసిన పూరి జగన్నాథ్ పేరు స్టేజ్ మీద చెప్పడం మర్చిపోయాడు మహేష్. అయితే అది అనుకోకుండా జరిగిందని మహేష్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ఈవెంట్ అయిన కొద్దిసేపటికే మహేష్ తన సోషల్ మీడియాలో పూరిజగన్నాథ్గురించి పోస్ట్ పెట్టాడు. తన స్పీచ్ లో ముఖ్యమైన వ్యక్తిని ప్రస్తావించడం మర్చిపోయానని, పోకిరి సినిమా ఎప్పటికీ మర్చిపోలేనని రాసుకొచ్చాడు.