బాలీవుడ్‌  స్టార్ హీరోయిన్స్  కంగనా రనౌత్‌, అలియా భట్‌ల మధ్య ట్వీట్‌ యుద్దానికి బ్రేక్ పడేటట్లు కనపడటం లేదు.   రోజు రోజుకూ విశ్వరూపం దాలుస్తోంది. తాజాగా ప్రముఖ  బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్‌, నటుడు గతంలో కంగనా రనౌత్‌పై చెప్పు విసిరారనే విషయం ఈ గొడవలో బయిటకు వచ్చి సెన్సేషన్ అయ్యింది. 

కంగనా సోదరి రంగోలి చందేల్‌ తాజా ట్వీట్‌లో ఈ విషయం  పేర్కొనడం బాలీవుడ్ లో షాకింగ్ గా మారింది. 2006లో  కంగనా రనౌత్‌ తాను నటించిన వాహ్‌ లంహే చిత్రం ప్రివ్యూ చూసేందుకు రాగా ఆమెపై దర్శకుడు మహేష్‌ భట్‌ చెప్పు విసిరాడని రంగోలి చందేల్‌ వరుస ట్వీట్లలో రివీల్ చేసారు.

అంతేకాకుండా ప్రివ్యూ థియేటర్‌లోకి కంగనాను అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించడంతో ఆ రాత్రంతా కంగనా ఏడుస్తూనే ఉన్నారని, అప్పుడామెకు 19 ఏళ్లు ఉంటాయని అన్నారు. ఈ తాజా ట్వీట్లతో కంగనా సోదరి రంగోలి, మహేష్‌ భట్‌ భార్య, అలియా భట్‌ తల్లి సోని రజ్దాన్‌ మధ్య సాగుతున్న ట్వీట్‌ యుద్దం పతాక స్దాయికి చేరింది. 

కంగనా రనౌత్‌కు అవకాశాలు ఇచ్చి తన భర్త (మహేష్‌ భట్‌) ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆమె ఆయన భార్య, కుమార్తెపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని సోని రజ్దాన్‌ మండిపడ్డారు. ఆ తర్వాత కొన్ని ట్వీట్స్ ని డిలేట్ చేసేసారు. 

మరో ప్రక్క అలియా భట్‌పై గత కొంతకాలంగా వీలుచిక్కినప్పుడల్లా కంగనా రనౌత్‌ మండిపడుతున్నారు. తాను నటించిన మణికర్ణిక సినిమాని  విమర్శకులు మెచ్చుకున్నా, అలియా మౌనం దాల్చడంపై కంగనా కోప్పడుతున్నారు. అలియా భట్‌ నటనను చిన్నబుచ్చుతూ తనను ఆమెతో పోల్చవద్దని పేర్కొనడం కూడా కంగనా, అలియా భట్‌ల మధ్య చిచ్చుని మరింతగా పెంచుతోంది.