టాలీవుడ్ దర్శక నిర్మాతలు మూకుమ్మడిగా తమ చిత్రాల విడుదల తేదీలు ప్రకటించడం జరిగింది. గత వారం రోజులుగా చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాలు, విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల అధికారిక విడుదల తేదీలపై స్పష్టత వచ్చింది. ఆర్ ఆర్ ఆర్, పుష్ప, విరాటపర్వం, మేజర్, ఉప్పెన వంటి చిత్రాల విడుదల తేదీలు మేకర్స్ ప్రకటించడం జరిగింది. సర్కారు వారి పాట మేకర్స్ కూడా విడుదల తేదీ ప్రకటించిన అందరినీ షాక్ కి గురి చేశారు. 2022 సంక్రాంతి కానుకగా మహేష్ సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించేశారు. 

సర్కారు వారి పాట షూటింగ్ మొదలై వారం రోజులు కూడా పూర్తి కాకుండానే విడుదల తేదీ ప్రకటించడం ఆశ్చర్యకర అంశమే అని చెప్పాలి. సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో దర్శకుడు ప్లాన్ చేశాడు.  అక్కడే  ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. విడుదల తేదీ పోస్టర్ లో తాళాల గుత్తి చేతిలో పట్టుకున్న మహేష్ లుక్ ఆకట్టుకుంది. 

దర్శకుడు పరుశురామ్ సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఆర్ధిక నేరాలు, బ్యాంకింగ్ కుంభకోణాలు ప్రధానాంశంగా సర్కారు వారి పాట తెరకెక్కనుందని సమాచారం. ఇక సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ లుక్ అండ్ యాటిట్యూడ్ పూర్తి భిన్నంగా దర్శకుడు ప్లాన్ చేశారట.  మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ మరియు జి ఎం బి ఎటెర్టైన్మెంట్స్ కలిసి సర్కారు వారి పాట నిర్మిస్తున్నారు.  ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.