`ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ` చిత్రంలో డిటెక్టివ్‌ గా నటించి కామెడీ పంచిన నవీన్‌ పొలిశెట్టి ఇప్పుడు `జాతిరత్నాలు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. హిలేరియస్‌ కామెడీ చిత్రంగా ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. ఈ సినిమాలో నవీన్‌తోపాటు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటించారు.ఈ ముగ్గురు చేసే కొంటే చేష్టలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతుంది. 

దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ నవీన్‌ సక్సెస్‌లు కొడుతున్న నేపథ్యంలో అందరిని దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు నవీన్‌పై మహేష్‌బాబు కన్నుకూడా పడింది. ఆయన ఇటీవల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిన్నసినిమాలను, కాన్సెప్ట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అడవిశేషుతో `మేజర్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు `జాతిరత్నాలు` సినిమా నచ్చి నవీన్‌ పొలిశెట్టితోనూ ఓ సినిమాని నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఓ యువ దర్శకుడితో నవీన్‌ పొలిశెట్టి హీరోగా సినిమా చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.  

వరుసగా హిట్లు కొట్టడం, తనదైన కామెడీతో థియేటర్లో నవ్వులు పంచడంతో నవీన్‌కి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడట. దీంతోపాటు యూవీ క్రియేషన్స్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అనుష్క శెట్టి నటించే ఈచిత్రంలో ఆమెకి పెయిర్‌గా నవీన్‌ కనిపించబోతున్నట్టు భోగట్టా. మొత్తానికి నవీన్‌కి వచ్చిన క్రేజ్‌తో వరుసగా అవకాశాలు క్యూకడుతున్నాయని చెప్పొచ్చు.