ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రవర్తనలో పూర్తిగా మార్పొచ్చిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరి హీరోల సినిమాలకు తన సపోర్ట్ అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేసే మహేష్ రీసెంట్ గా 'అర్జున్ రెడ్డి' సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ వంగాతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

అయితే తాజాగా మరో కొత్త దర్శకుడు మహేష్ కి లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. 'RX100' చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి దర్శకుడిగా తన సత్తా చాటాడు. అతడితో సినిమా చేయడానికి హీరోలు సిద్ధంగానే ఉన్నారు. రీసెంట్ గా అజయ్ భూపతి.. మహేష్ బాబుని కలిసి ఓ లైన్ చెప్పాడట. టాలీవుడ్ నిర్మాత జెమిని కిరణ్ ప్రత్యేకంగా మహేష్-అజయ్ ల మీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

కథ సిద్ధంగా లేకపోవడంతో అజయ్ భూపతి ఓ లైన్ ని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు 'మహర్షి' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత సుకుమార్ తో ఓ సినిమా అలానే 14 రీల్స్ వారికి ఓ కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అజయ్ భూపతితో సినిమా అంటే ఇప్పట్లో ఆశించలేం!