సూపర్ స్టార్ మహేష్ బాబు తనకున్న అనారోగ్య సమస్య గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఒకప్పుడు విపరీతమైన మైగ్రేన్ సమస్యతో బాధపడ్డారట. ఆ బాధ నుండి బయటపడడానికి చాలా మంది వైద్యులను సంప్రదించారట. వారెవరి వలన నయం కానీ సమస్య చక్రసిద్ధ నాడి వైద్యంతో నయమైందని తెలిపారు.

తనకున్న మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు భార్య నమ్రత స్నేహితురాలి ద్వారా సత్య సింధూజ అనే డాక్టర్ ని కలిసినట్లు చెప్పారు. ఆమెకి చక్రసిద్ద నాడీ వైద్యం గురించి తెలుసని.. ఆమె తనకు అందించిన చికిత్స ఏంటో తెలియదు కానీ నాలుగైదు సార్లు ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోయిందని.. ఇప్పుడున్న టాబ్లెట్లు కేవలం నొప్పిని తాత్కాలికంగా నివారిస్తాయని.. అది సరైన పద్ధతి కాదని చెప్పారు.

నొప్పిని తట్టుకోలేక విపరీతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకునేవాడినని మహేష్ చెప్పారు. కానీ సత్య సింధూజ అందించిన వైద్యంతో టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదని.. ఎలాంటి టాబ్లెట్లు తీసుకోకుండా ఇతర చికిత్సల ద్వారా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చనేది తను నమ్మే సిద్ధాంతమని చెప్పారు. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారికి ఎలా నివారించుకోవాలో తెలియాలనే ఈ విషయాన్ని మీడియా ముందుచెప్పినట్లుగా వెల్లడించారు.

తన కుటుంబసభ్యులు, స్టాఫ్ కి మాత్రమే తనకు మైగ్రేన్ ఉందని తెలుసునని.. తన వర్క్ ద్వారానే మెడిటేషన్ చేస్తుంటానని చెప్పుకొచ్చారు. నాడీ వైద్యం గురించి ప్రచారం 
కల్పిస్తున్నానని అనుకోకపోతే ఎన్ని చికిత్సలు తీసుకున్నా మైగ్రేన్‌ వల్ల చాలా కాలంగా బాధపడుతున్నవారు ఒకసారి చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి తెలుసుకోండని సలహా ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.