జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రిన్స్ మహేష్  బాబు కూడా పవన్ కు గ్రీటింగ్స్ చెప్పాడు. 'పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దయాగుణం, వినయం స్ఫూర్తిదాయకం. మీకు మంచి ఆరోగ్యం, సంతోషం చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. దీంతో పాటు గతంలో పవన్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. 

పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ రోజు.. అంటే సెప్టెంబర్ 2 పండుగ రోజు లాంటిది. ఎందుకంటే, ఈ రోజు తమ అభిమాన హీరో పుట్టినరోజు. పైగా కొంత కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ పలు సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలను ప్రకటించారు కూడా.

ఈ నేపథ్యంలో వస్తున్న బర్త్ డే కాబట్టి, దీనికి ఓ ప్రత్యేకత వుందని చెప్పుకోవచ్చు. అందుకే పవన్ తో సినిమాలు నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు కూడా కొత్త అనౌన్స్ మెంట్లతో ఈ రోజు అభిమానులను ఆనందింపజేస్తున్నారు. ఈ క్రమంలో, పవన్ నిర్మాతల నుంచి ఇప్పటికే మూడు సర్ ప్రైజ్ లు వచ్చాయి. 

మరోవైపు, పవన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం 'వకీల్ సాబ్' యూనిట్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.