ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న మహేష్ బాబు, తన తదుపరి చిత్రాన్ని ఇంత వరకు ప్రకటించలేదు. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్‌ సందర్భంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా ఉంటుందని చెప్పినా తరువాత ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారు. ఆ తరువాత చాలా మంది దర్శకుల పేర్లు తెరమీదకు వచ్చిన ఫైనల్‌గా గీతా గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేష్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

మే 31న సూపర్‌ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వటం మహేష్‌కు అలవాటు. దీంతో ఈ నెల 31న తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇవ్వనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ నెల 27నే లాంఛనంగా ప్రారంబించాలని ప్లాన్ చేశాను. కానీ కరోనా కారణంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవటంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీంతో గ్రాండ్‌గా మూవీ లాంచ్‌ ప్లాన్ చేసిన నిర్మాతలు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

తాజాగా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్‌లోనే సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్‌. సినిమా టైటిల్‌తో పాటు టెక్నీషియన్స్‌ లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారట. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ మూవీ అప్‌డేట్‌ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది.