మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. జనవరి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్, ఆర్ధిక నేరాల నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ రోల్ కూడా సరికొత్తగా ఉంటుందని సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

ఐతే ఈ చిత్రం తరువాత మహేష్ ఓ యువ దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది నితిన్ హీరోగా విడుదలైన రొమాంటిక్ ఎంటర్టైనర్ భీష్మ మంచి విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రంతో పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఇటీవల వెంకీ కుడుముల మహేష్ ని కలిసి ఓ కథ వినిపించారట. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్ల మహేష్ సానుకూలంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. 

అన్నీ కుదిరితే త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. మరి ఈ వార్తలపై స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి-మహేష్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకవేళ వెంకీ కుడుముల చిత్రం ఓకే అయితే రాజమౌళి మూవీ మొదలయ్యే లోపు మహేష్ ఈ చిత్రం పూర్తి చేసే అవకాశం ఉంటుంది.