సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ ప్రమోట్‌ చేసినందుకు ఇప్పుడు ఆయన్ని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మరో కేసులో నోటీసులు అందుకున్నారు. 

హీరో మహేష్‌ బాబుని రియల్‌ ఎస్టేట్‌ కేసు వెంటాడుతుంది. ఆయన ప్రమోట్‌ చేసినందుకు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ప్రాపర్టీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 

గతంలో మహేష్‌ బాబు సాయి సూర్య డెవలపర్స్ సంస్థకి ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇది రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా ఉంది. 

ఈ ప్రాపర్టీలో స్థలం కొన్న కస్టమర్‌.. తమని మోసం చేశారంటూ సంస్థపై, ప్రచారం చేసిన మహేష్‌ బాబు కేసు వేశారు. ఇదే ఇప్పుడు మహేష్‌ ని చిక్కుల్లో పడేసింది.

మహేష్‌ బాబుకి మరో నోటీసులు 

మహేష్‌ బాబు చాలా బ్రాండ్‌లను ప్రమోట్‌ చేస్తున్నారనే విషయం తెలిసిందే. తెలుగు హీరోల్లో అత్యధికంగా కమర్షియల్ యాడ్స్ చేస్తున్న హీరోగా నిలిచారు. అందులో భాగంగానే సాయి సూర్య డెవలపర్స్ సంస్థకి ప్రచారకర్తగా వ్యవహరించారు.

 మహేష్‌ ఫోటోతో ఉన్న బ్రౌచర్‌ చూసి బాలాపూర్‌లో రూ.34.80లక్షలు పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో లే ఔట్‌ లేకపోవడంతో డబ్బు ఇవ్వమంటే సంస్థ రూ.15 లక్షలు మాత్రమే రిటర్న్ ఇచ్చింది. మరో ఇరవై లక్షలు ఇవ్వలేదు.

దీంతో వారు కోర్ట్ ని ఆశ్రయించారు. ఈ కేసులో మహేష్‌ బాబుకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీస్‌లిచ్చింది. సోమవారం(జులై 7న) విచారణకు హాజరు కావాలని మహేష్‌కి కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది. 

మహేష్‌ తోపాటు సంస్థ ప్రతినిధులు కూడా ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి ఈ విచారణకు మహేష్ బాబు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో ఈడీ కేసు విచారణ ఎదుర్కొన్న మహేష్ బాబు

గతంలోనూ మహేష్‌ బాబు ఈ సంస్థకి సంబంధించిన ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సురానా గ్రూప్‌, దాని అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్‌లపై పలు ఆరోపణలు ఉన్నాయి. 

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కి చెందిన అనుమతులు లేని ప్రాజెక్ట్‌లను మహేష్ బాబు ఎండోర్స్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

 మరోవైపు మహేష్‌ బాబు కూడా తన రెమ్యూనరేషన్‌ బ్లాక్‌లో తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్ట్‌లను ప్రమోట్ చేసినందుకు అతను 5.9 కోట్ల రూపాయలు అందుకున్నారని, 

ఇందులో రూ.3.4 కోట్లు చెక్కు ద్వారా, 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించారని బయటకు వచ్చింది. దీనిపైనే ఈడీ దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేశారు.

 తప్పుదారిలో మనీ ట్రాన్స్ఫర్‌ అయ్యిందని ఈడీ భావించి విచారించింది. ఇప్పుడు ఇందులోనే మరో కేసు మహేష్‌ ని వెంటాడుతుండటం విచారకరం.

రాజమౌళితో `ఎస్‌ఎస్‌ఎంబీ29`లో నటిస్తున్న మహేష్‌

ప్రస్తుతం మహేష్‌ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` చిత్రంలో నటిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారు జక్కన్న. హాలీవుడ్‌ సంస్థలు కూడా ఈ మూవీకి పనిచేస్తున్నాయి.

 ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా మూవీ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో మహేష్‌ తోపాటు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది.