సూపర్ స్టార్ మహేష్ బాబు ఇకపై సినిమాల విషయంలో ఎక్కువ గ్యాప్ తీసుకునేలా కనిపించడం లేదు. సమ్మర్ కానుకగా విడుదలైన మహర్షి చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక మహేష్ బాబు తదుపరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శుక్రవారం రోజు లాంచ్ చేయనున్నారు. 

అంతకంటే ముందుగానే చిత్ర యూనిట్ మహేష్ అభిమానులకు కానుక అందించనుంది. నేటి అర్థరాత్రి 12 గంటలకు మహెష్ 26 చిత్రానికి సంబంధించి అదిరిపోయే సర్ప్రైజ్ ఉందని ప్రకటించారు. దీనితో సినిమా టైటిల్ విడుదల చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు అని చెబుతున్నారు. 

ఈ చిత్రానికి 'సరిలేరు నీకెవ్వరూ', 'రెడ్డి గారి అబ్బాయి' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటిలో దేనిని ఖరారు చేస్తారో చూడాలి. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతోందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి శుక్రవారం రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.