సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం మంచి విజయం సాధించింది. యుఎస్, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో కాస్త నిరాశపరిచిన మిగిలిన ఏరియాల్లో ఈ చిత్రాలు వసూళ్ళని పిండుకుంటోంది. మహర్షి మహేష్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మహేష్ బాబు ప్రస్తుతం ఎంచక్కా తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నాడు. మహేష్ బాబు గ్లామర్ కు, ఫెర్ఫామెన్స్ కు బాలీవుడ్ నటులు సైతం అసూయపడుతుంటారు. 

కొన్ని రోజుల క్రితం హాలీవుడ్ దర్శకుడి నోట మహేష్ పేరు వినిపించడం ఆసక్తిగా మారింది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బిల్ డ్యూక్ మహేష్ బాబుతో ఓ స్పై సినిమా చేయాలని ఉందని ట్వీట్ చేశాడు దీనితో మహేష్ క్రేజ్ హాలీవుడ్ కు కూడా పాకిందని ఆయన అభిమానులు సంబరపడ్డారు. మహేష్ బాబుని జేమ్స్ బాండ్ తరహా చిత్రంలో చూడాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. 

కానీ బిల్ డ్యూక్ ప్రతిపాదనపై మహేష్ బాబు చాలా ఫన్నీగా స్పందించాడు. ఆయనపై సెటైర్ కూడా వేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. బిల్ డ్యూక్ మీ గురించి ట్వీట్ చేశారు. ఆయన్ని కలిసే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా.. ఆయనకు ఏ పని లేదేమో.. అందుకే నా గురించి మాట్లాడారు.. లేకుంటే హాలీవుడ్ వాళ్ళు మన గురించి ఎందుకు ట్వీట్ చేస్తారు అంటూ మహేష్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. 

మహేష్ బాబు తదుపరి అనిల్ రావిపూడి దర్శత్వంలో నటించబోతున్నాడు. దేశభక్తి, కామెడీ ప్రధానాంశాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రష్మిక మందన హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.