హీరో విశాల్‌కి కోర్ట్ షాక్‌ ఇచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న `చక్ర` చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై మద్రాస్‌ హైకోర్ట్ స్టే విధించింది. ఈ చిత్ర కథ హక్కులు తమవే అంటూ నిర్మాత రవి మద్రాస్‌ హైకోర్ట్ ని ఆశ్రయించగా, మంగళవారం కోర్ట్ స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ చిత్రానికి ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకత్వం వహించారు. విశాల్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మించారు. 

ఇందులో విశాల్‌ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. రెజీనా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని తమిళంతోపాటు తెలుగులోనూ తెరకెక్కించారు. ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. డిజిటల్‌ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. 

ఈ చిత్ర తనదని గతంలో విశాల్‌తో `యాక్షన్‌` చిత్రాన్ని నిర్మించిన ట్రిడెంట్‌ ఆర్ట్స్ నిర్మాత రవింద్రన్‌ ఆరోపిస్తున్నారు. ఈ కథ హక్కులకు సంబంధించి తనకు చెల్లిస్తానని చెప్పి అమౌంట్‌ని ఇంకా విశాల్‌ చెల్లించలేదని, ఇచ్చిన మాట తప్పారని రవింద్రన్‌ ఆరోపిస్తున్నారు. అంతేకాదు `చక్ర` సినిమాని తనకే నిర్మించే అవకాశం ఇస్తానని, మాటతప్పారనే వాదనలతో రవింద్రన్‌ కోర్ట్ ని ఆశ్రయించారని సమాచారం.