కమల్‌ హాసన్‌ హీరోగా `ఇండియన్‌2` చిత్రాన్ని రూపొందిస్తున్నారు శంకర్‌. లైకా నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పలు ప్రమాదాల కారణంగా వాయిదా పడింది. సినిమా మధ్యలోనే ఆపేశారు. కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` అనే మరో సినిమా చేస్తున్నారు. దర్శకుడు శంకర్‌..తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ భారీ సినిమాని ప్రకటించారు. మరోవైపు హిందీలో `అపరిచితుడు` రీమేక్‌ని రణ్‌వీర్‌సింగ్‌తో చేయబోతున్నట్టు ప్రకటించారు శంకర్‌. ఈ రెండు సినిమాలతో ఆయన బిజీగా కాబోతున్నారు. 

దీంతో `ఇండియన్‌ 2` నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ మద్రాస్‌ హైకోర్ట్ కెక్కింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ ఈ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు  సూచించింది. లైకా ప్రొడక్షన్‌లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో శంకర్‌పై నిర్మాణ సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా లైకా ప్రోడక్షన్స్‌ తమ వాదనలు వినిపిస్తూ..` గత ఏడాది మార్చికే `ఇండియన్‌-2` షూటింగ్‌ పూర్తి చేస్తామని శంకర్‌ హామీ ఇచ్చారని, ఆలస్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్‌పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. అయితే నటుడు వివేక్‌ మృతి చెందడంతో ఆ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్‌ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ జోక్యంలో సమస్యకు పరిష్కారం కాదని, ఇరు పక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ సినిమా ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు సమాచారం.