దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారకి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. 

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారకి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఇటీవల ఆమె నటించిన 'ఐరా', 'మిస్టర్ లోకల్' వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. లేడీ ఓరియెంటెడ్ నేపధ్యంలో ఆమె నటించిన సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా 'కొలైయుదీర్ కాలం' సినిమా విడుదలకు నోచుకోవడం లేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మొదటినుండి ఈ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా, నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఆ తరువాత ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. ఇక ఇటీవల జరిగిన సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాధారవి.. నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదానికి దారి తీశారు.

ఈ వ్యవహారమంతా సద్దుమణిగి ఈ నెల 14న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోన్న సమయంలో మద్రాస్ హైకోర్టు ఈ సినిమాకి షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. బాలాజీ మోహన్ అనే వ్యక్తి 'కొలైయుదీర్ కాలం' సినిమా టైటిల్ ను తాను రూ.10 లక్షలు చెల్లించి పొందానని, ఆ టైటిల్ హక్కులు తనకు చెందినవని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తన టైటిల్ ను ఉపయోగించిన నయనతార చిత్ర విడుదలపై నిషేధం విధించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు మంగళవారం నయనతార నటించిన ఈ సినిమా విడుదలపై స్టే విదిస్తూ ఉతర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఈ జూన్ 21లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.