దక్షిణ భారత నటీనటుల సంఘమైన నడిగర్ సంఘం కార్యవర్గానికి హైకోర్ట్ లో ఊరట లభించింది. ఆ సంఘం భవన నిర్మాణానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ని మద్రాస్ హైకోర్ట్ కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టీ.నగర్, అబిబుల్లా రోడ్ లో నడిగర్ సంఘం ఆఫీస్ ఉంది.

అక్కడ పాత బిల్డింగ్ ని కూల్చివేసి కొత్తగా బహుళ ప్రయోజనాలతో కూడిన భవనాన్ని ఆ సంఘ కార్యదర్శి ఆద్వర్యంలో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంఘానికి చెందిన స్థలానికి పక్కన ఉన్న 33 చదరపు అడుగుల ప్రకాశం రోడ్డును ఆక్రమించుకున్నారంటూ విద్యోదయ కాలనీకి చెందిన శ్రీరంగం, అన్నామలై అనే వ్యక్తులు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ని స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. ఆక్రమణ వ్యవహారానికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ని నియమించి పూర్తి వివరాలను కోర్టుకి అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్ బిల్డింగ్ నిర్మాణం ఎలాంటి ఆక్రమిత స్థలంలో జరగడం లేదనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టుకి సమర్పించారు. దీంతో ఈ కేసుపై తీర్పు బుధవారం వెల్లడించనున్నారు.