నెంబర్ వన్ రియాలిటీ షో 'బిగ్ బాస్' ప్రస్తుతం తమిళంలో మూడో సీజన్ నడుస్తోంది. కమల్ హాసన్ హోస్ట్ చేస్తోన్న ఈ షో మొదటి నుండి ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే ఈ షో నుండి మధుమిత ఎలిమినేట్ అయింది. ఆ తరువాత రెమ్యునరేషన్ కి సంబంధించి నిర్వాహకులతో గొడవ పడిందని వారు పోలీస్ కంప్లైంట్ చేశారు.

తనపై విజయ్ టీవీ తప్పుడు కేసు పెట్టిందని రెండు వారాల క్రితం మధుమిత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అలానే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా చెల్లించలేదని చెప్పింది. అయితే తాజాగా ఈ నటి బిగ్ బాస్ షోపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన తోటి కంటెస్టంట్స్ తనను హింసించారని.. షో నుండి తనను బలవంతంగా బయటకి పంపేశారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా కమల్ హాసన్ పై కూడా ఆరోపణలు చేసింది. హౌస్ లో తనను అంతా టార్చర్ చేస్తుంటే హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ చూసీచూడనట్లుగా వ్యవహరించారని.. ఈ విషయాన్ని ఆయన పెద్ద సీరియస్ గా తీసుకోలేదని ఫిర్యాదులో రాసుకొచ్చింది.

నిజానికి మధుమిత బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హౌస్ లో కెప్టెన్ గా ఉన్న సమయంలో మిగిలిన ఇంటి సభ్యుల నుండి ఆమెకి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆమెపై వాళ్లు పలు ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీంతో అదే వారం ఆమెని షో నుండి ఎలిమినేట్ చేశారు.