'నచ్చావులే' ఫేం మాధవీలతా తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. దీంతో అమ్మడు గురించి పట్టించుకునేవారు లేకుండా పోయారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలపై మండిపడి వార్తల్లో నిలిచింది మాధవీలత.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయడం, జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడడంతో ఆమె జనసేన పార్టీలో చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకుంది. తాజాగా ఈమెకి బీజీపీ నుండి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

గుంటూరు వెస్ట్ నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఈమె పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. ఆదివారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆమె పేరుని ఖరారు చేశారు. టికెట్ రావడంతో  మాధవీలతా తన ప్రచారాన్ని మొదలుపెట్టింది. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అధిష్టానానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని నమ్మకంగా చెబుతోంది. 

ఇక ఇదే నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున మద్దాల గిరిధర్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున చంద్రగిరి ఏసురత్నం, జనసేన పార్టీ తరఫున తోట చంద్రశేఖర్ రావు పోటీ పడుతున్నారు.