Asianet News TeluguAsianet News Telugu

బిగ్ న్యూస్: 'మా' ఎలక్షన్ తేదీ ఖరారు.. అందరి చూపు ప్రకాష్ రాజ్, విష్ణుపైనే..

తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. చిత్ర పరిశ్రమని అనేక సమస్యలు కబళిస్తున్న ఈ తరుణంలో మా ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

MAA election date announced all eyes on prakash raj and vishnu
Author
Hyderabad, First Published Aug 25, 2021, 6:02 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. చిత్ర పరిశ్రమని అనేక సమస్యలు కబళిస్తున్న ఈ తరుణంలో మా ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొన్ని నెలల క్రితమే మా ఎన్నికలు జరగాల్సింది. కానీ కరోనా పరిస్థితుల వల్ల ఎన్నిక సెప్టెంబర్ కు వాయిదా పడింది. 

సెప్టెంబర్ నెల దగ్గరపడుతున్నా మా ఎన్నికల తేదీ ఖరారు కాకపోవడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి. మా ఎలక్షన్స్ మరింత ఆలస్యం కానున్నాయి అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నిక తేదిని ఖరారు చేశారు. 

అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా మా ఎన్నికల గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సారి ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష బరిలో నిలవడం.. అతడికి పోటీగా మంచు హీరో విష్ణు ఎన్నికల్లో నిలబడుతుండడం ఉత్కంఠగా మారింది. 

వీరితో పాటు సివిఎల్ నరసింహారావు, జీవిత, హేమ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఊహించని విధంగా మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందరికంటే ఆయన ముందస్తు ప్రణాళికతో దూసుకుపోతున్నారు. 

సినిమా బిడ్డలు పేరుతో తన ప్యానల్ ని కూడా రెడీ చేసుకున్నారు. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ ముద్ర ఉంది. ఇక విష్ణు.. తన సొంత ఖర్చులతో మా బిల్డింగ్ నిర్మిస్తానని హామీ ఇచ్చేశాడు. సో ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు మధ్యే ప్రధాన పోటీ ఉండబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా నరేష్ ఉన్న సంగతి తెలిసిందే. మా కి కొత్త అధ్యక్షుడు ఎవరనేది అక్టోబర్ 10న తేలనుంది. 

కరోనా ప్రభావం, థియేటర్స్ సమస్యల,  ఓటిటి వివాదం.. ఇలాంటి సమస్యలతో ప్రస్తుతం ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios