ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత శ్రీమణి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. చాలా కాలంగా నడుస్తూన్న తన ప్రేమకథను కొనసాగిస్తూ...పెద్ద వారిని ఒప్పించి వివాహాన్ని చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘నా చిన్నారి దేవతా(ఫరా).. నా జీవితంలోకి స్వాగతం. ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. మొత్తానికి కల నెరవేరింది. మా మనసులను అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటిగా చేసిన మా తల్లిదండ్రులతో పాటు ఆ దేవుడికి కృతజ్ఞతలు’ అని కామెంట్‌ పెట్టారు.  ఆయన స్వయంగా ట్విటర్‌లో ఫొటోలతో సహా పంచుకున్నారు.అని ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతేకాదు.. మ్యారెజ్‌ లైఫ్‌ బిగిన్స్‌ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా పెట్టారు. 

ఈ నేపధ్యంలో సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ సరదాగా స్పందించారు ‘‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు అర్థమైంది. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట’’ అని ట్వీట్‌ చేశారు. 

ఇక శ్రీమణి ‘100% లవ్’లో ‘ఏ స్క్వేర్‌ బీ స్క్వేర్‌..’ అంటూ  తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ‘అహో బాలు’, ‘దటీజ్‌ మహాలక్ష్మి..’ పాటలు కూడా శ్రీమణి రాసినవే. ఆ తర్వాత పెద్దపెద్ద హీరోలకు పాటలు రాసే అవకాశాలు వచ్చాయి.  జులాయి సినిమాలో ‘చక్కని బైక్‌ ఉంది..’, ‘మీ ఇంటికి ముందో గేటు..’ పాటలు రాశారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో ఆరడుగుల బుల్లెట్టు.. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో ‘జారుకో జారుకో..’ పాట కూడా శ్రీమణి రాసిందే. ఉప్పెన సినిమాలోనూ ‘నీకళ్లు నీలి సముద్రం’ అంటూ ఆయన రాసిన పాట సృష్టించిన రికార్డులు మనకు తెలిసిందే. శ్రీమణికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏషియానెట్ తెలుగు ఈ జంటకు వైవాహిక శుభాకాంక్షలు తెలియచేస్తోంది.