Shilpa Shetty - Raj Kundra: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. పెట్టుబడి పేరుతో రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై ఈ దంపతులపై ముంబై పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.
Shilpa Shetty - Raj Kundra: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్థిక, వ్యాపారా లావాదేవీలకు సంబంధించి ఈ దంపతులుపై తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో ఇప్పటికే జైలుకు కూడా వెళ్లొచ్చాడు రాజ్ కుంద్రా. అంతా బాగుంటుందనుకున్న తరుణంలో శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు నమోదైంది. తాజాగా ఈ దంపతులకు ముంబై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏమిటి ? లుకవుట్ నోటీసులు జారీ చేసేలా శిల్పా శెట్టి దంపతులు ఏం తప్పు చేశారు?
రూ.60 కోట్ల మోసం?
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడి పేరుతో వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసు నేపథ్యంలో, ముంబై పోలీసులు ఈ దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడులకు సంబంధించినట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ దీపక్ కొఠారి ఆరోపణల ప్రకారం, శిల్పా–రాజ్ దంపతులు వ్యాపార విస్తరణ పేరుతో తన వద్ద నుంచి రూ.60 కోట్లు తీసుకున్నారు. కానీ ఆ నిధులను వ్యాపారం కోసం కాకుండా, వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకున్నారని ఆరోపించారు.
ఆరోపణలు ఏంటీ?
వ్యాపారవేత్త దీపక్ కొఠారి ప్రకారం, మొదట ఈ మొత్తాన్ని రుణంగా తీసుకుంటున్నట్లు చెప్పారని, తర్వాత పన్ను ఆదా కోసం పెట్టుబడిగా చూపించారని తెలిపారు. 2015లో జరిగిన ఒప్పందాల ప్రకారం, ఏప్రిల్‌లో రూ.31.95 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.28.53 కోట్లు ఆయన బదిలీ చేశారని చెప్పారు. ఈ నిధులన్నీ బెస్ట్ డీల్ టీవీ బ్యాంకు ఖాతాకు వెళ్లాయని పేర్కొన్నారు. అయితే తర్వాత శిల్పా–రాజ్ తమ మాట నిలబెట్టుకోలేదని, డబ్బును తిరిగి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా, ఈ మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అంతే కాకుండా, శిల్పా శెట్టి స్వయంగా లిఖితపూర్వక హామీ ఇచ్చారని కొఠారి వెల్లడించారు. అంతేకాకుండా తర్వాత శిల్పా శెట్టి డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిందని, ఆ కంపెనీపై ఇప్పటికే రూ.1.28 కోట్ల దివాలా కేసు నడుస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. తాను ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని అన్నారు.
శిల్పా–రాజ్ స్పందన
అయితే, ఈ ఆరోపణలన్నింటినీ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఖండించారు. “ మా మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమే. కోర్టులో దీనికి తగిన సమాధానం ఇస్తాం, ఈ కేసు వెనుక మమ్మల్ని పరువు తీయాలనే ఉద్దేశమే ఉంది” అని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఆడిటర్‌ను విచారణకు పిలవడం, అలాగే శిల్పా–రాజ్ విదేశీ పర్యటనల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
