అతిలోక సుంద‌రి శ్రీదేవి భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా..  సినిమాల ద్వారా ఆమె ఎప్ప‌టికి అభిమానులని అల‌రిస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఆమె మైనపు విగ్రహాన్ని సింగపూర్ నందు గల ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 4న గ్రాండ్ గా శ్రీదేవి విగ్రహాన్ని ఆ మ్యూజియంలో లాంచ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా భర్త బోనీ కపూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. శ్రీదేవి ''మా హృదయాలలోనే కాదు, లక్షలాదిగా ఉన్న ఆమె అభిమానుల హృదయాలలో ఆమె ఇంకా బ్రతికే ఉన్నారు. ఈనెల 4న మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న నా శ్రీమతి విగ్రహం కోసం నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.

దీంతో ఓ చిన్న ప్రోమో వీడియోను కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో శ్రీదేవి బంగారు వన్నె వస్త్రాలలో, కిరీటం ధరించి ఉన్నారు. గ‌తంలో బాలీవుడ్ నుంచి అమితాబ్, 
హృతిక్, ఐశ్వర్య, షారుక్, మాధురి దీక్షిత్ ఇలా అనేక మంది మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసారు. ఇటీవ‌లే టాలీవుడ్ నుంచి మహేష్, ప్రభాస్ మైన‌పు విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు.