Sathi Leelavathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి వెండితెరపై కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతుంది. పెళ్లి అయిన తర్వాత ఆమె హీరోయినగా నటించిన `సతీ లీలావతి` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది. 

తల్లిగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలుగా రాణిస్తోంది. ఆమె వరుణ్‌ తేజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఆ మధ్యనే కొడుకు జన్మించాడు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. కొడుకు సంరక్షణలో బిజీగా ఉంది. అదే సమయంలో మెగా ఫ్యామిలీ విషయంలో ఎంతో బాధ్యతతో ఉంటోంది లావణ్య. ఆ మధ్య చిరంజీవి గురించి, మెగా ఫ్యామిలీ గురించి నెగటివ్‌ కామెంట్లు చేసిన వారికి ఇచ్చిపడేసింది. వారికి చుక్కలు చూపించింది. తన ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడటంలో ఆమె ముందుంటున్నారని చెప్పొచ్చు.

లావణ్య త్రిపాఠి కమ్‌ బ్యాక్‌

ఇదిలా ఉంటే ఇప్పుడు లావణ్య త్రిపాఠి వెండితెరపై మరోసారి సందడి చేయడానికి వస్తోంది. ఆమె కమ్‌ బ్యాక్‌ ఇస్తోంది. ఆమె పెళ్లి అయిన తర్వాత నటించిన సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. తాజాగా రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. లావణ్య త్రిపాఠి చివరగా `సతీ లీలావతి` అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకులకే రిలీజ్‌కి సిద్ధమైంది. వచ్చే నెల మే 8న సినిమాని రిలీజ్‌ చేస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. రిలీజ్‌కి రెండు వారాల ముందే ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం.

సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌

లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన `సతీ లీలావతి` చిత్రంలో ఆమెకి జోడీగా దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శ్రుతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. పెళ్లై, కొడుకు పుట్టిన తర్వాత లావణ్య నుంచి వస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

సతీ లీలావతి మూవీ కాన్సెప్ట్ 

రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని `స‌తీ లీలావ‌తి` చిత్రంలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాను రూపొందించామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ కానుంది.