సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా కాలంగా నిజజీవితాల ఆధారంగా సినిమాలు తీస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

ఇటీవల 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తాజాగా 'టైగర్ కేసీఆర్' సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. టైటిల్ ని కన్ఫర్మ్ చేయడంతో పాటు ఓ పాట పాడుతూ వీడియో కూడా షేర్ చేశారు. ఆంధ్రోడా అంటూ సాగిన ఆ పాటపై వివాదం చెలరేగింది.

వర్మ పాటతో ఈ సినిమా ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుందేమోననే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై తాజాగా వర్మ వివరణ ఇచ్చారు. తాను తీయబోయే సినిమా ఆంధ్రప్రజలకు వ్యతిరేకంగా ఉండదని, తెలంగాణా ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే 'టైగర్ కేసీఆర్' ఉంటుందని తెలిపారు.

తెలుగు ప్రజలందరినీ కేసీఆర్ ప్రేమించారని, ఆయన యుద్ధం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆంధ్ర నాయకుల మీదేనని అన్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.