దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న 'RRR' సినిమాకు టైటిల్ పెట్టే అవకాశం అభిమానులకే ఇచ్చారు. ఇటీవల రాజమౌళి 'RRR' వర్కింగ్ టైటిల్ నే పూర్తి పేరుగా పెట్టబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు దాని కోసం 'RRR' టైటిల్ మీరే పెట్టండంటూ అభిమానులకు ఓ ప్రకటన విడుదల చేశారు.

''మా దర్శకుడు  'RRR'పదాలకు నాలుగు భాషల్లో సరైన టైటిల్స్ పెట్టే అవకాశం మీకే ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మా దృష్టికి ఎన్నో మంచి టైటిల్స్ వచ్చాయి. స్టోరీలైన్ కు తగ్గట్లు మీరు అనుకున్న మంచి టైటిల్ మాకు మరిన్ని పంపిస్తే వాటిలో మంచి టైటిల్ ని ఎంపిక చేసి సినిమాలో వాడతాం. #RRRTITLE పేరుతో టైటిల్స్‌ను పంపించండి'' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

ఇది చూసిన అభిమానులో రకరకాల టైటిల్స్ ని పంపిస్తున్నారు. వాటిలో కొన్ని.. 'రాజుల రణరంగం', 'రావణ రాజ్యంలో రాముడు భీముడు', 'రామభీమ రణరంగం', 'రామరాజుల రణరంగం', 'రామరాజుల రాజసం'.

ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీం గా కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.