ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాపై ప్రముఖ ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోం సల్లే మండిపడ్డారు.

తను రూపొందించిన 'లార్గో వించ్'ను స్పూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ నటించిన  'అజ్ఞాతవాసి'పై ఆయన స్పందించారు. 'అజ్ఞాతవాసి' కూడా 'లార్గో వించ్' ప్రేరణతో తీశారని ఆయన అన్నారు.

అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు జెరోం సల్లే.. 'సాహో' సినిమాను ఉద్దేశించి కూడా ఇలానే ట్వీట్ చేశారు. రెండోసారి 'లార్గో వించ్'ను ఫ్రీమేక్ చేశారని తప్పుపట్టారు. 'సాహో' తనకు నచ్చలేదని అన్నారు. తన సినిమాను స్పూర్తిగా తీసుకున్నారని.. కానీ దాన్ని సక్రమంగా తెరకెక్కించలేకపోయారని.. కాస్త చూసుకొని రీమేక్ లు చేయాలని సలహా ఇచ్చారు.

అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు. ఇటీవలే ఈ సినిమాలో ఓ పాటలో ఆర్ట్ వర్క్ కాపీ చేశారని నటి లిసారే సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం ఇంకా సద్దుమణగక ముందే ఇప్పుడు మరోసారి సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి.