నటి అపూర్వకు సినీ కష్టాలు వచ్చాయి. అంటే.. సినిమా అవకాశాలు  లేకపోవడం కాదండి. సినిమాల్లో హీరో హీరోయిన్లకు అనుకోకుండా వస్తాయే .. అలాంటి కష్టాలు అనమాట. అపూర్వకు మాత్రం నిజజీవితంలో వచ్చాయి.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...సినీ నటి అపూర్వకు చెందిన భూమిపై కబ్జాదారులు కన్నేసారు. అపూర్వకు తన సొంతూరైన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నాలుగు ఎకరాల పొలం ఉంది.కొంత కాలంగా సరిహద్దుకు సంబంధించి పక్కనే ఉన్న పొలాల రైతులకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య వివాదం నడుస్తోంది. 

వివాదం నేపధ్యంలో ఎన్నిసార్లు సరిహద్దు రాళ్లు వేసినా, రైతులు వాటిని తొలగించడమే కాకుండా, పొలంలోకి ఎలా అడుగుపెడతావంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఇటీవల స్ధానిక విఆర్‌ఓ సహకారంతో పొలంలో సరిహద్దు రాళ్లు వేయించారు అపూర్వ. అయితే వాటిని కొద్దిసేపటికే తొలగించారు రైతులు.

సరిహద్దు రాళ్లను తొలగించడమే కాకుండా.. ఆమెపై దుర్భాషలాడటంతో అపూర్వ పోలీసులను ఆశ్రయించింది. పొలం సరిహద్దు వివాదం కారణంగా రాళ్లు వేయాలంటున్నామని, ఆ సమయంలో తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు కోరారు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు హమీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారని, పరిష్కారం లభించకపోతే, అప్పుడు మిగతా విషయాలు చెబుతానన్నారు అపూర్వ.
 
మరోవైపు ఈ కేసు విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనిని సరిహద్దు వివాదంగానే వారు చెబుతున్నారు. అంతేకాని ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడా లేదని, ఎలా ఈ అంశం వైరల్ అయ్యిందో తమకు తెలిదంటున్నారు. ఇది సివిల్ వ్యవహారం అని, అపూర్వ సెలబ్రిటీ కావడం వలన ఇది ప్రాముఖ్యత సంతరించుకుందని పోలీసులు చెబుతున్నారు.