బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ - కరీనా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమవడంతో తాజాగా హైదాబాద్ లో ‘మెగా’ ప్రివ్యూను ప్రదర్శించారు.
ఇండియన్ సినీ హిస్టరీలోనే బ్రేక్ చేయలేని బాక్సాఫీస్ రికార్డును సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan). ‘దంగల్’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా హయ్యేస్ట్ గ్రాసింగ్ మొదటి ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ మూవీని బ్రేక్ చేయలేకపోతున్నారు స్టార్ డైరెక్టర్స్. ‘త్రీ ఇడియెట్స్’, ‘ధూమ్ 3’ ‘పీకే’, ‘దంగల్’తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనూ స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా టాలీవుడ్ లోని అగ్ర స్థాయి హీరోలు, డైరెక్టర్లతోనూ అమీర్ ఖాన్ కు మంచి స్నేహమే ఉంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ లోనూ అమీర్ ఖాన్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా నటించిన తాజాగా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ (Lal Singh Chaddha). ఈ కామోడీ డ్రామా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఆగస్టు 11న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే ఈ చిత్ర ప్రివ్యూను తాజాగా హైదరాబాద్ లో ప్రదర్శించడం విశేషం. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగా స్టార్ మధ్య ఉన్న స్నేహం, టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమ అతిథుల కోసం ‘మెగా’ ప్రివ్యూను ప్రదర్శించారు.
హైదరాబాద్ లోని చిరంజీవి ఇంట్లోనే నిర్వహించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారు. అలాగే కింగ్ నాగార్జున, అక్కినేని నాగచైతన్య కూడా ప్రివ్యూను వీక్షించారు. ‘లాల్ సింగ్ చద్దా’ ప్రత్యేక ప్రివ్యూకి మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులంతా ఈ సినిమా పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రివ్యూకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటి.
మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్ మరియు కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వారసుడు నాగ చైతన్య (Naga Chaitanya) నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను గీతా ఆర్ట్స్ దక్కించుకోవడం విశేషం.
