"ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా రిలీజ్ ను ఆపటానికి వీల్లేదని,  వాక్ స్వేచ్ఛ‌ని అడ్డుకోబోమ‌ని తెలంగాణా హైకోర్ట్  తేల్చిచెప్పింది.  దాంతో ఈ సినిమాకు ఏ సమస్యా లేనట్లే అని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేసారు వర్మ.  మార్చి 29న రిలీజ్ అవుతుంద‌ని రిలీజ్ డేట్ పోస్టర్స్ వదిలేసారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలు సమస్య ఇంకా తీరనట్లే అంటున్నారు సినీ రంగంలో తలపండిన వాళ్లు..ఎన్నో సినిమాలకు సమస్యలతో తలపడినవాళ్లు. 

వాళ్లు అనేది ఏమిటి అంటే... హై కోర్టు సినిమా రిలీజ్‌ని ఆప‌మని  మాత్ర‌మే చెప్పింది. కానీ అసలు ట్విస్ట్ సెన్సార్ బోర్డు దగ్గర ఉంటుంది. వాళ్లు సెన్సార్ చెయ్యమని చెప్పరు . కానీ సెన్సార్ చేయటానికి లేటు అయితే ఎవరూ చేసేదేమీ ఉండదు. సెన్సార్ చేయకుండా రిలీజ్ చేయలేరు కదా. అందులోవనూ సెన్సార్ కి ఎటువంటి ఆదేశాలు కూడా కోర్ట్  ఇవ్వలేదు. రిలీజ్‌ని ఆపటం అనేది ఒక అంశం మాత్రమే. అయితే ప్రొసీజర్ ప్రకారం .., సెన్సార్ బోర్డు క్లియ‌ర్ చేయ‌డం వేరే అంశం. ఎట్టిపరిస్దితుల్లోనూ ఎలక్షన్స్ ముందు సెన్సార్ బోర్డు నుంచి క్లియ‌రెన్స్ వ‌స్తేనే సినిమా విడుద‌ల అవుతుంది. లేకపోతే ఆ లేటు ఇంకో వారానికి వెళ్లిపోతుంది. పెద్దగా కలిసొచ్చేదేమీ లేదు అంటున్నారు. 

ఇక వచ్చే శుక్రవారం అంటే మార్చి 29న విడుద‌ల కావాల్సిన ఈ  సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సార్ కాలేదు. సోమ‌వారం కానీ, మంగ‌ళ‌వారం కానీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి అవుతాయ‌ని వ‌ర్మ నమ్మకంగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే సెన్సార్ రూల్స్ ప్రకారం...అంతకు ముందు సెన్సార్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలను క్లియర్ చేస్తూ ప్రయారిటీ ప్రకారం ముందుకు వెళ్తుంది.  

ఎన్టీఆర్‌ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌.   ఈ చిత్రం ప్రమోషన్‌ విషయంలో వర్మ విభిన్నమార్గాలు అనుసరిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న  సంగతి తెలిసందే. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్లతో ఆకట్టుకున్న  ఈ చిత్రంకు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. 

ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నాయని చెప్పబడుతున్న  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్‌.