సాంకేతికత బాగా పెరిగాక, దాన్ని వినియోగించుకుంటూ కథలు చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు దర్శక,నిర్మాతలు. మరీ ముఖ్యంగా బాహుబలి, రోబో చిత్రాల రిలీజ్ తర్వాత మనవాళ్లందరి దృష్టీ విఎఫ్ఎక్స్ తో భారీ చిత్రాలు తీయటంపై పడింది. ఈ సినిమాలు కనుక వర్కవుట్ అయితే భారీగా లాభాలు సైతం వస్తాయి. తాజాగా  3డి టెక్నాలిజీతో చేసిన మొదట పౌరాణిక చిత్రంగా కురక్షేత్రం టైటిల్ తో మహాభారత కథలోని అంశాలతో ఓ  సినిమా సౌత్ లో రాబోతున్నది.  

శాండిల్ వుడ్ లో సంచలనం సృష్టిస్తున్న  ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసారు. కేజీఎఫ్ కంటే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం. తెలుగులో అన్నమయ్య, మంజునాధ, పాండురంగ వంటి పౌరాణిక చిత్రాలు రచన చేసిన జె.కె భారవి స్క్రిప్టుతో ఈ సినిమాని తెరకెక్కించారు. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ ట్రైలర్ ని చూడవచ్చు. 

ఇక కన్నడ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘కురుక్షేత్ర’ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా 2డి ఇప్పటికే పూర్తవగా, 3డి ప్రక్రియ కొనసాగుతోంది. సినిమాను ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వీక్షించారు. ఇందులో కొడుకు నిఖిల్‌ అభిమన్యుడి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌కు ఇది 50వ సినిమా కావడం కూడా మరో విశేషం. తమ అభిమాన నటుడి సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

కురుక్షేత్ర సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. ఇందులో చందనసీమతో పాటు బాలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖ నటీనటులు నటించడం గమనార్హం. భీష్ముడుగా అంబరీష్‌, కృష్ణుడుగా క్రేజీస్టార్‌ రవిచంద్రన్‌, మరో ముఖ్య పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, సోనూ సోద్ వంటివారు నటించారు. భారీ తారాగణంతో పాటు భారీ సెట్టింగ్‌లు కూడా కురుక్షేత్ర బడ్జెట్‌ను పెంచాయి. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్‌సిటీలో యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరించారు. కన్నడ సినిమాల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదిగా కురుక్షేత్ర ఉంటుందని చెప్తున్నారు.