ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకుని మంచి జోష్‌ లో ఉన్న హీరో వరుణ్‌ ధావన్‌పై ప్రభాస్‌ `ఆదిపురుష్‌` హీరోయిన్‌ కృతిసనన్‌ సెటైర్లు వేసింది. పాపం చిన్న పాప అని కూడా చూడకుండా వరుణ్‌ ఇలా చేస్తాడనుకోలేదంటూ ఆవేదని చెందింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోని ఇస్టాలో పంచుకుంది. మరి వరుణ ధావన్‌ ఏం చేశాడు? కృతి ఎందుకలా? అన్నదనేది చూస్తే.. వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ కలిసి బాలీవుడ్‌లో `భేడియా` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో జరుగుతుంది. 

చిత్ర యూనిట్‌లో ఒకరి కుమార్తె బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు. చిన్న పాప కావడంతో హీరో వరుణ్‌ ధావన్‌ చేత కేక్‌ కట్‌ చేయించాడు. వరుణ్‌ ఆ కేక్‌ని ఆ పాపకి తినిపించాలి. కానీ ఆయన అలా చేయలేదు. ఆ పాప తండ్రికి తినిపించాడు. జనరల్‌గా కేక్‌ అంటే పిల్లలు నోరూరిస్తారు. దానికోసమే వెయిట్‌ చేస్తుంటారు. అదే మాదిరిగా ఇందులో కేక్‌ కోసం ఆ పాప ఆశగా చూసింది. కేక్‌ తనకే పెడుతాడని భావించి ఎంతో ఆశతో నోరు కూడా తెరిచింది. కానీ వరుణ్‌ ఆ పనిచేయలేదు. ఆ పాపని ఎత్తుకున్న తండ్రికి కేక్‌ని తినిపించాడు. దీంతో ఆ పాప పూర్తిగా నిరాశ చెందింది. 

ఈ వీడియోని తీసిన కృతి తన ఇన్‌స్టాలో పంచుకుంటూ వరుణ్‌ని ఓ ఆట ఆడుకుంది. 'ఈ వీడియో మిమ్మల్ని రోజంతా నవ్విస్తుందనుకుంటా. ఇలాంటి ఘటనలు మనకూ ఎదురై ఉంటుంది. మనమూ చూసి ఉంటాం. కానీ మరీ ఘోరంగా చిన్నపాప అని కూడా చూడకుండా ఇలా చేస్తావ్‌ అనుకోలేదు వరుణ్‌' అని పేర్కొంది కృతి. దీనికి వరుణ్‌ స్పందించారు. `సారీ.. ఇది పాప బర్త్‌డే కానీ, సెలబ్రేషన్స్‌ మాత్రం ఆమె తండ్రివి` అని తనదైన స్టయిల్‌లో రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వరుణ్‌, కృతీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తుండగా దినేశ్‌ విజన్‌ నిర్మిస్తున్నాడు. అభిషేక్‌ బెనర్జీ, దీపక్‌ డోబ్రియాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కృతి `హమ్‌ దో హమారే దో`, `బచ్చన్‌ పాండే` చిత్రాల్లో నటిస్తుంది. `మిమి` సినిమా విడుదలకు రెడీగా ఉంది. తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌ సరసన `ఆదిపురుష్‌`లో సీతగా నటిస్తుంది కృతి. ఇందులో రాముడిగా ప్రభాస్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు.