ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. ఆయన తొలి స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ చిత్రం ఇదే కావడం విశేషం. హిందీ, తెలుగుతోపాటు ఇతర సౌత్‌ లాంగ్వేజ్‌లో కూడా ఇది పాన్‌ ఇండియన్‌ సినిమాగా రూపొందుతుంది. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. తాజాగా సీత ఎవరో తెలిసిపోయింది. చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. 

మొదటి నుంచి వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి. సీత పాత్రలో మహేష్‌ హీరోయిన్‌ కృతిసనన్‌ని ఫైనల్‌ చేశారు. ఆమె ప్రభాస్‌ సరసన సీతగా మెరవబోతున్నారు. ఇక లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారు. ప్రధానంగా ఇందులో హిందీ నటులకే ప్రయారిటీ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక టీ సిరీస్‌ సంస్థ దీన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతుంది. 

ఆ మధ్య సినిమా షూటింగ్‌ రోజే అగ్నిప్రమాదం చోటు చేసుకుని షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైలెంట్‌గా షూటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రభాస్‌ ముంబయిలోనే మకాం పెట్టారు. ఇందులో ప్రభాస్‌ పొడవాటి మీసాలతో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఆయన లుక్‌పై అనేక విమర్శలు, కామెంట్లు వచ్చాయి. చాలా ఏజ్డ్ గా కనిపిస్తున్నారని అభిమానులు సైతం కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల చేయబోతున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ తెలుగులో `రాధేశ్యామ్‌`చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకుడు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా పాన్‌ ఇండియన్‌ చిత్రంగా నిర్మిస్తున్నారు. ఇది జులై 30న విడుదల కానుంది.