గత కొంతకాలంగా దర్శకుడు కృష్ణ వంశీ సైలెంట్ అయ్యిపోయారు. కెరీర్ పరంగా ఆయన పరిస్థితి అసలు బాగోలేదు. గ్యాప్ తీసుకుని సాయి ధరమ్ తేజ హీరోగా  'నక్షత్రం' సినిమా తో 2017 లో ప్రేక్షకులను పలకరించారు కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఆయనతో అనుకున్న ప్రాజెక్టులు అన్ని అటకెక్కాయి. 

వాస్తవానికి 'నక్షత్రం' సినిమా తర్వాత కృష్ణవంశీ 'రుద్రాక్ష' అనే సినిమాకు దర్శకత్వం వహించాలని ప్లాన్ చేసారు. సోషియో ఫాంటసీ సినిమా గా తెరకెక్కించాలని స్క్రిప్టు సైతం రెడీ చేసుకున్నారు.  ఈ సినిమాలో సమంత మరియు రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో  ఎంపిక చేసారు. దిల్ రాజు ఈ సినిమాని  ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. అయితే రకరకాల కారణాలతో  ఈ సినిమా ఆగిపోయింది.  

అయితే అందుతున్న సమాచారం ప్రకారం...మళ్లీ కృష్ణవంశీ ఆ ప్రాజెక్టు ని తిరిగి ఓపెన్ చేసారు. స్టార్ కాస్టింగ్ ని మార్చి ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నారట. ఆ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దిల్ రాజు సైతం ఈ ప్రాజెక్ట్ చేద్దామనే ఆలోచనలో ఇప్పటికీ ఉన్నారట. అయితే అనుష్క దొరికితే  ప్రాజెక్టుకు ప్లస్ అవుతుందని, ఆమె డేట్స్ ఇస్తానంటే మొదలెడదామని చెప్పారట. అంటే ఇప్పుడు కృష్ణవంశీ టాస్క్...అనుష్కని ఒప్పించటం.

అయితే కృష్ణవంశీ మాత్రం దిల్ రాజుతో కాకపోయినా  ఈ సినిమాను ఎలాగైనా మళ్ళీ పట్టాలెక్కించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతగా అనుష్క సెట్ కాకపోతే  ఈ సినిమాలో కొత్త నటీనటులతో చేద్దామనుకుంటున్నారట. తాను స్క్రిప్టుని పూర్తిగా నమ్మానని చెప్తున్నారట. చూడాలి మరి ఈ రుద్రాక్ష ఏమౌతుందో.